
వనపర్తి, 17 జూన్ (హి.స.)
గడిచిన 10 సంవత్సరాలలో
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలయ్యిందని, అయినప్పటికీ ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం వారు వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల పరిధిలోని రంగవరం, గోపాల్దిన్నె, వీపనగండ్ల, పుల్గర్ చర్ల గ్రామాలలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఇందిరమ్మ గృహప్రవేశాలు నిర్వహించారు. గోపాల్ దిన్నె గ్రామ శివారులో సుమారు రెండు కోట్ల 12 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన 33/11 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. అనంతరం గోపాలదిన్నెలో ఇందిరమ్మ గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతు వేదికలు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రంలో 65 వేల కోట్లుగా అప్పు, గడిచిన బీఆర్ఎస్ 10 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో 8 లక్షల కోట్లకు చేరిందన్నారు.
అయినప్పటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. గోపాల్ దిన్నె గ్రామ శివారులో 357 సర్వేనెంబర్ భూమిలో గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న భూ సమస్యను త్వరలోనే సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చట్టం ప్రకారం రెవెన్యూ అధికారులు అర్హులను గుర్తించి భూ పంపిణీ చేయడం జరుగుతుందని ఎవరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదని అన్నారు. రంగవరం, గోపాల్ దిన్నె గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..