
హనుమకొండ, 17 జూన్ (హి.స.) హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని నర్సింగరావుపల్లి గ్రామంలో 14 సంవత్సరాల క్రితం మూతపడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభోత్సవం, అలాగే ప్రీ-ప్రైమరీ పాఠశాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి పాఠశాలను పునఃప్రారంభించారు. అనంతరం నర్సింగరావుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. తర్వాత విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులు పంపిణీ చేశారు.
విద్యాశాఖ అధికారులు, గ్రామ ప్రజల సంకల్పం వల్లే ఈ రోజు పాఠశాలను పునఃప్రారంభించగలిగామని తెలిపారు. ప్రాథమిక పాఠశాలతో పాటు ప్రీ-ప్రైమరీ పాఠశాలను కూడా ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ నుంచి 5వ తరగతి వరకు పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే బోధన ఉంటుందని చెప్పారు. నర్సింగరావుపల్లి ప్రాథమిక పాఠశాలకు అవసరమైన అన్ని వసతులు కల్పించే బాధ్యత తనదేనని, అలాగే గ్రామ ప్రజలు తమ పిల్లలను 5వ తరగతి వరకు ఇతర పాఠశాలలకు పంపకుండా ఈ పాఠశాలలోనే చదివించే బాధ్యత తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయులు పాఠశాలను తమ సొంత ఇల్లులా భావించి పనిచేయాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యాబోధనపై పూర్తి నమ్మకం కలిగేలా ఉపాధ్యాయుల పనితీరు ఉండాలని అన్నారు.
ఈ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తానని, విద్యార్థులకు ఆటవస్తువులు కూడా అందజేస్తానని హామీ ఇచ్చారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో వసతుల కొరత లేదా ఉపాధ్యాయుల లేమితో ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా మూతపడేందుకు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. త్వరలోనే నారాయణగిరిలో తెలంగాణ మోడల్ స్కూల్ ప్రారంభం కానుందని తెలిపారు. అలాగే రూ.200 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అదనంగా క్రీడా పాఠశాల, క్రికెట్ స్టేడియం కూడా మంజూరయ్యాయని వెల్లడించారు. విద్యారంగ అభివృద్ధికి తన పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..