దొంగలని ముద్ర..మానసికంగా కుంగిపోయిన తల్లి..ఆత్మహత్య
దొంగలని ముద్ర..మానసికంగా కుంగిపోయిన తల్లి..ఆత్మహత్య
దొంగలని ముద్ర..మానసికంగా కుంగిపోయిన తల్లి..ఆత్మహత్య


సంతకవిటి,, 17 జూన్ (హి.స.)

ఏడాది క్రితమే భర్త దూరమయ్యాడు. ఆ బాధలోనే ఉంటూ ఒక్కగానొక్క కుమారుడితో జీవిస్తోంది. ఈ క్రమంలో అనుకోని రూపంలో వారిపై ఓ నింద పడింది. తప్పు చేశారో లేదో తెలియనప్పటికీ.. ఊర్లో అందరూ దొంగలని ముద్రించడం, పోలీసులు వచ్చి ఆరా తీస్తుండడంతో మనస్తాపం చెందారు. స్టేషన్కు రమ్మని పిలవడంతో తట్టుకోలేకపోయారు. దీంతో ఇద్దరూ ప్రాణాలు తీసుకోవాలని భావించారు. రైలుకు ఎదురుగా పట్టాలపై నిలబడ్డారు. ఈ క్రమంలో పేగుబంధం గుర్తొచ్చి కుమారుడ్ని పక్కకు నెట్టేసి, ఆ తల్లి ఆత్మహత్యకు చేసుకుంది. ఈ విషాదకర ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పెనుబర్తి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.

..సంతకవిటి మండలం రామరాయపురానికి చెందిన వై.కళావతి(55) కుమారుడితో కలిసి ఉంటున్నారు. గతనెల 25న గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. నాలుగు తులాల బంగారం, రూ.12 వేలు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎనిమిది మందిపై అనుమానం ఉందని, వారి పేర్లు చెప్పారు. అదే రోజు ఎస్సై ఆర్.గోపాలరావు పెద్దల సమక్షంలో అనుమానితులను విచారించారు. ఈ క్రమంలోనే కళావతి, ఆమె కుమారుడు చిరంజీవిపై మంగళవారం స్టేషన్లో ఫిర్యాదు అందడంతో మధ్యాహ్నం తల్లీకుమారుడ్ని పిలిపించారు. స్టేషన్కు వెళ్లేసరికి ఎస్సై లేకపోవడంతో ఇద్దరూ తిరుగుముఖం పట్టారు.

ఇద్దరూ ఇంటికి వస్తున్న సమయంలో మానసికంగా కుంగిపోయారు. దొంగలని ముద్ర వేయడంతో తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవాలని భావించారు. చరవాణిలో గ్రామస్థులకు విషయాన్ని తెలిపారు. ఏమీ చేసుకోవద్దని, తామంతా ఉన్నామని వారంతా నచ్చజెప్పారు. బంధువులు, గ్రామ పెద్దలు వెళ్లేసరికి పెనుబర్తి సమీపంలో గుర్తుతెలియని రైలు కిందపడి కళావతి మృతిచెందారు. కుమారుడ్ని పక్కకు నెట్టేయడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం తెలుసుకునేందుకే రమ్మన్నామని, తాను లేకపోవడంతో సిబ్బంది వెళ్లిపోమ్మని చెప్పారని ఎస్సై వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande