
కొత్తగూడెం, 17 జూన్ (హి.స.)
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న
సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొండంత ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు .ప్రజల అవసరాలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేస్తూ తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు లబ్ధిదారులకు స్వయంగా చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గానికి చెందిన 34 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అలాగే, అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చుల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న మరో 25 మంది లబ్ధిదారులకు రూ.13 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. పేదరికం కారణంగా ఏ ఒక్క కుటుంబం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని గుర్తుచేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు