
అన్నమయ్య,17 జూన్ (హి.స.) : రైతులను రీసర్వే కష్టాలు వెంటాడుతున్నాయి.
గత ప్రభుత్వ హయాం నుంచి నేటి వరకు తప్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎల్పీఎం(ల్యాండ్ పార్సిల్ మ్యాప్) సమస్యతో అటు అధికారులు, ఇటు రైతులు సతమతవుతున్నారు. అన్నమయ్య జిల్లాలోని రైతులకు, అధికారులకు రీసర్వే తలనొప్పిగా మారింది.
సర్వే పూర్తిగాక.. ఒకవేళ అయినా తప్పులు అలాగే ఉండటంతో ఇబ్బంది పడుతున్నారు. 60 శాతానికి పైగా రీసర్వే జరిగినట్లు అధికారులు చెబుతున్నా పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయడం లేదు. 20 ఏళ్లుగా రుణాలు ఇస్తున్న బ్యాంకర్లు ఇప్పుడు కొత్త నిబంధనలు పెడుతున్నారు. పొలం మీద రుణం కావాలంటే పట్టాదారు పాసు పుస్తకం, వన్బీ తీసుకురావాలని ఖరాఖండీగా చెబుతున్నారు. ఈ క్రమంలో రైతులు వాటికోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. తప్పులు సరిదిద్దేదెవరు?: గత ప్రభుత్వం నుంచి రీ సర్వేలో తప్పులు అలాగే ఉన్నాయని, ఎవరిని అడిగినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
చుక్కల పట్టా భూములను అసైన్డ్ భూములుగా మార్చారని, వాటిని మార్చాలని మొత్తుకుంటున్నా ఫలితం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాల్మీకిపురం మండలం జరావారిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వేనంబర్లు 274, 283, 267లలో 25 ఎకరాల చుక్కల పట్టాల భూములను గత ప్రభుత్వంలో అసైన్డ్ భూములుగా చూపారు. వాటిని ఇప్పటివరకు పరిష్కరించలేదు. చాలావరకు సర్వే నెంబర్లు, విస్తీర్ణం తప్పుగా నమోదయ్యాయి. గుర్రంకొండ గ్రామంలో ఒక రైతుకు 3.50ఎకరాల పొలం ఉండగా రికార్డుల్లో 90 సెంట్లు మాత్రమే చూపుతుండటంతో లబోదిబోమంటున్నాడు. జాయుంట్ ఎల్పీఎంలతో సతమతం ఎల్పీఎం(ల్యాండ్ పార్సిల్ మ్యాప్)భూ హద్దుల రేఖాచిత్రం సమస్య ప్రధానంగా రైతులను వేధిస్తోంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV