తిరుమలలో తగ్గని రద్దీ.. నేడు ఆర్జిత సేవా టికెట్లు విడుదల
తిరుమలలో తగ్గని రద్దీ.. నేడు ఆర్జిత సేవా టికెట్లు విడుదల
తిరుమల


తిరుమల, 18 జూన్ (హి.స.) తిరుమలలో ప్రతిరోజూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం కూడా రద్దీ కాస్త ఎక్కువగా ఉంది. ఉదయం 7 గంటల సమయం వరకూ వైకుంఠం క్యూ కాంప్లెక్సులో ఉన్న 31 కంపార్టుమెంట్లు శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్న భక్తులతో నిండిపోయాయి. ఉదయం 8 గంటల తర్వాతి నుంచి క్యూలైన్లోకి ఎలాంటి టోకెన్ లేకుండా వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. రూ.300 శీఘ్రదర్శనానికి 3-4 గంటల సమయం, సర్వదర్శనమ్, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుందని పేర్కొంది.

ఇక నిన్న (బుధవారం) 82,438 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 39,948 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.4.24 కోట్లు సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది. అలాగే 4.16 లక్షల లడ్డూలు విక్రయించగా.. 2.14 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు.

నేటి ఉదయం 10 గంటలకు టీటీడీ.. ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవ వంటి ఆర్జిత సేవా కోటా టికెట్లను విడుదల చేయనుంది. ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఎంపికైన వారు జూన్ 20 నుంచి జూన్ 22 మధ్య చెల్లింపులు చేస్తే.. టికెట్లను కేటాయిస్తారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను జూన్ 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande