
ఆసిఫాబాద్, 18 జూన్ (హి.స.)
రెబ్బెన మండల కేంద్రంలోని అటవీ శాఖ (ఫారెస్ట్ రేంజ్) కార్యాలయ ప్రాంగణంలో గురువారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత, జిల్లా అటవీ అధికారి (డీఎఫ్) బాలమణితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరిత మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో మొక్కల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. పెరుగుతున్న పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో మొక్కలు ప్రధాన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని చెప్పారు. కార్యాలయ ప్రాంగణంలో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత సంబంధిత అధికారులు, సిబ్బందిపై ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం కలెక్టర్ హరిత స్థానిక ఫారెస్ట్ రేంజ్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి వాటి సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి బాలమణి, రెబ్బెన ఫారెస్ట్ రేంజ్ అధికారి రమాదేవి,రెబ్బెన గ్రామ సర్పంచ్ దుర్గం భరద్వాజ్, అటవీ శాఖ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది,, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..