
హైదరాబాద్, 18 జూన్ (హి.స.)
ప్లే స్కూల్ కు వెళ్తున్న మూడున్నరేళ్ల
చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కరాటే కోచ్ కు రాజేంద్రనగర్ స్పెషల్ పోక్సో కోర్టు కఠిన శిక్ష విధించింది. నేర నిర్ధారణ కావడంతో నిందితుడికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ.. జడ్జి తీర్పు వెలువరించారు. మియాపూర్ పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘోర ఘటన అప్పట్లో సంచలనం రేపింది. 2019 జూన్ 12 బాలిక పేరెంట్స్.. స్థానిక ప్లే స్కూల్లో చేర్పించారు. స్కూల్లో చేరిన మర్నాటి నుంచే కరాటే కోచ్ గా పనిచేస్తున్న కిరణా సాయి (24) అనే యువకుడు లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో భయపడిన పాప.. రోజూ స్కూలుకు వెళ్లనంటూ మారాం చేసేది. ఎంత ఏడ్చినా.. పిల్లలు ఇలానే చేస్తారనుకున్న తల్లిదండ్రులు ఆమెను సముదాయించి పంపేవారు. కొద్దిరోజుల తర్వాత.. ఆ చిన్నారి ఈ విషయాన్ని అమ్మమ్మకు చెప్పడంతో.. ఈ దారుణం వెలుగుచూసింది.
విషయం అర్థంచేసుకున్న అమ్మమ్మ.. వెంటనే మియాపూర్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కిరణ్ సాయిపై పోలీసులు పోక్సో (POCSO Act) చట్టం కింద కేసు నమోదు చేసి, అతడిని అరెస్ట్ చేశారు. ఏడేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత నిందితుడికి పోక్సో కోర్టు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితుడికి సహకరిస్తూ.. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిన ప్లే స్కూల్ ప్రిన్సిపల్ దీపిక (30)కు కూడా కోర్టు మూడేళ్లు జైలుశిక్ష వేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..