సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి..పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి..పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి
Police


రంగారెడ్డి, 18 జూన్ (హి.స.)

సైబర్ నేరాలు రోజురోజుకు

పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్ స్టేషన్ ను గురువారం కమిషనర్ తరుణ్ జోషి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లోని రికార్డులు, దర్యాప్తు పురోగతి, శాంతి భద్రతల నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న సేవల తీరును కమిషనర్ సమీక్షించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని, ఫిర్యాదులపై తక్షణ స్పందన ఇవ్వాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. మహిళలు, పిల్లల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలను అందించాలని ఆదేశించారు. అనంతరం తరుణ్ జోషి మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఓటిపి లను షేర్ చేయడం, తెలియని లింకులకు క్లిక్ చేయడం, లోన్ యాప్స్ డౌన్లోడ్ చేయడం ప్రమాదకరమని తెలిపారు. ఏదైనా సైబర్ నేరానికి గురైతే 1930 కి వెంటనే కాల్ చేయాలని సూచించారు.

కమ్యూనిటీ పోలీసింగ్ తో గ్రామస్థాయిలోనే ప్రజలకు సైబర్ నేరాలపై పోలీసులు పూర్తి అవగాహన కల్పించాలని కమిషనర్ తరుణ్ జోషి సిబ్బందిని ఆదేశించారు. ఫ్యూచర్ సీపీ తరుణ్ జోషి వెంట షాద్ నగర్ డిసిపి సిహెచ్. శిరీష, ఏసిపి ఎస్. లక్ష్మీనారాయణ ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande