
హైదరాబాద్, 18 జూన్ (హి.స.)
వానకాలం పంటల సాగు మొదలైన
వేళ రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఇవాళ సెక్రటేరియట్లో నిర్వహించిన అనధికార మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానకాలం పంట సాగులో మొత్తం 7 రకాల సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొన్నారు. యాసంగిలో సుమారు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని అన్నారు. ఈ నెల 30న మధిరలో భారీ బహిరంగ సభలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, రాష్ట్రానికి సరిపడా ఎరువుల కోటాను విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
దీనితోపాటు వానాకాలం సీజన్కు సంబంధించి రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ అనధికార సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైతులు ఖరీఫ్ సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. విత్తనాలు నాటేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో రైతు భరోసా పథకం నిధుల కోసం చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారు. దీంతో ప్రభుత్వం రైతు భరోసా పథకం నిధుల విడుదలపై కీలక అప్డేట్ ఇచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు