
హైదరాబాద్, 18 జూన్ (హి.స.)
పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు చేరేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఆయన అధ్యక్షతన జరిగిన 18వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో రూ. 30,515 కోట్ల విలువైన 50 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఈ కంపెనీల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో 29,677 ఉద్యోగాలు రానున్నాయని అంచనా వేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, పరిశ్రమల స్థాపన కేవలం ధనికులకే సాధ్యమనే భావనను తొలగించి, సామాన్యులు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అనువైన వాతావరణం సృష్టించాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామికాభివృద్ధి జరుగుతోంది. ఈ ఫలాలు పేద, మధ్య తరగతికి ఉద్యోగాల రూపంలోనే కాకుండా, వారు కూడా కంపెనీలు స్థాపించేలా ప్రోత్సహించాలి. స్టార్టప్లకు పెద్దపీట వేయాలి. దీనికోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్టీఐహెచ్ (ఆర్టీఐహెచ్) సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని, వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి పెట్టుబడులు ఆకర్షించాలి అని దిశానిర్దేశం చేశారు.
ప్రాజెక్టులకు అనుమతులు పొందాక వెంటనే పనులు ప్రారంభించని సంస్థల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, 'నాన్-సీరియస్ ప్లేయర్స్'కు ఏపీలో చోటులేదని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi