
చిత్తూరు , 18 జూన్ (హి.స.) చిత్తూరు జిల్లా కుప్పంలో ఏనుగుల సంచారం కలకలం రేపుతోంది. రామకుప్పం మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది.
గుంపుగా వచ్చిన ఏనుగుల గుంపు మామిడితోటపై దాడి చేసింది. ఉదయం పూట కాకుండా రాత్రి సమయాల్లోనే ఎక్కువగా ఏనుగుల గుంపు తోటల్లోకి వస్తోంది. దీంతో రాత్రి సమయంలో బయటకు రావాలంటే బయపడిపోతున్నారు. అంతే కాకుండా పంటలు, తోటలకు తీవ్ర నష్టం కలుగుతోందని రైలులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల రాకతో గ్రామాల్లో సైతం భయాందోళనలు నెలకొన్నాయి. ననియాల, ఎస్ గొల్లపల్లి ప్రాంతాల్లోకి ఏనుగులు చొరబడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
ఇప్పటికే అటవీశాఖ అధికారులకు ప్రజలు సమాచారం ఇవ్వగా.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏనుగుల కదలికలపై సైతం అధికారులు నిఘా పెంచారు. ఏనుగులను అదుపు చేయాలని, అటవీ ప్రాంతంలోకి మళ్లించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు మన్యం జిల్లాలో కూడా ఏనుగుల సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పార్వతీపురం మండలం బందలుప్పి మైదాన ప్రాంతంలో ఏనుగుల సంచారం పెరిగింది. మంగళవారం జామదాల ప్రాంతంలో పామాయిల్ తోటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. కొద్దిరోజులు సాలూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తిరిగిన ఏనుగులు ప్రస్తుతం పార్వతీపురం వైపు వెళుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఏనుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV