
రేణిగుంట, 18 జూన్ (హి.స.): తిరుపతి జిల్లాలో తోతాపురి మామిడి కొనుగోలు ప్రక్రియలు సజావుగా కొనసాగుతున్నాయని,రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.
శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డితో కలిసి రేణిగుంట మండలంలోని వర్ష ప్రాసెసింగ్ యూనిట్ను సందర్శించిన ఆయన కొనుగోలు విధానాలు, ధరల అమలు, రైతులకు అందుతున్న సేవలను సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉందని, తోతాపురి మామిడికి కిలోకు రూ.6 కంటే తక్కువ ధర చెల్లించకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎక్కడైనా తక్కువ ధర చెల్లించినట్లు తెలిసినా వెంటనే జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇవ్వాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రానున్న 10 నుంచి 15 రోజులు తోతాపురి సీజన్లో కీలకమని పేర్కొన్న కలెక్టర్, రైతులు పూర్తిగా పక్వానికి వచ్చిన కాయలను మాత్రమే కోసి విక్రయించాలని సూచించారు.
ప్రాసెసింగ్ యూనిట్ల వద్ద రద్దీ నివారణకు టోకెన్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. గత 10 రోజుల్లో వర్ష ప్రాసెసింగ్ యూనిట్ ఒక్కటే సుమారు 25 వేల టన్నుల తోతాపురి మామిడిని కొనుగోలు చేయగా, జిల్లాలోని అన్ని యూనిట్లు కలిపి 80 వేల నుంచి 90 వేల టన్నుల వరకు సేకరణ జరిగిందన్నారు.
ఈ సీజన్లో జిల్లాలో సుమారు 2.5 లక్షల టన్నుల తోతాపురి దిగుబడి నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో పండే ప్రతి తోతాపురి మామిడి కాయను కొనుగోలు చేసేలా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి, తహసిల్దార్ శ్రవణ్ కుమార్, ఉద్యానవన శాఖ అధికారులు,ప్రాసెసింగ్ యూనిట్ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV