
తిరుపతి, 18 జూన్ (హి.స.)తిరుపతి జిల్లాలో మోటారు వాహన చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్న కాంట్రాక్ట్ క్యారేజీ,ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ బస్సులపై రవాణాశాఖ అధికారులు ఈ రోజు ఉదయం ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు చేపట్టారు.
జిల్లా రవాణాశాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆదేశాల మేరకు గత రెండు రోజులుగా చేపట్టిన తనిఖీల్లో రెండు బస్సులను స్వాధీనం చేసుకోగా,30 బస్సులపై కేసులు నమోదు చేసి సుమారు రూ.10 లక్షల మేర జరిమానాలు విధించారు. తనిఖీల సందర్భంగా కలకత్తా నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఒక కాంట్రాక్ట్ క్యారేజీ బస్సు ఆల్ ఇండియా పర్మిట్ పన్ను చెల్లించకుండా నడుస్తున్నట్లు గుర్తించిన అధికారులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బస్సుపై పన్ను, అపరాధ రుసుము కలిపి రూ.5.20 లక్షలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. అదేవిధంగా మోటారు వాహన చట్టం, సంబంధిత నిబంధనలను ఉల్లంఘించిన 30 ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ వాహనాలపై కేసులు నమోదు చేసి,సుమారు రూ.5 లక్షల జరిమానా విధించారు.ఇక హైదరాబాద్ నుంచి తిరుపతికి వస్తున్న ఓ టూరిస్ట్ బస్సు నిర్దేశిత వేగ పరిమితిని మించి ప్రయాణిస్తున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ కంట్రోల్ రూమ్ సాంకేతిక పర్యవేక్షణలో గుర్తించింది.
ఈ బస్సులో తప్పనిసరిగా అమర్చాల్సిన GPS ట్రాకింగ్ పరికరాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసినట్లు కూడా గుర్తించారు.GPS ట్యాంపరింగ్ మోటారు వాహన చట్టం ప్రకారం తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణించబడుతుందని, సంబంధిత వాహన యజమానిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించే అతివేగం, పన్ను ఎగవేత, GPS పరికరాల నిర్వీర్యం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా రవాణాశాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు.
ఈ తనిఖీలలో మోటారు వాహన తనిఖీ అధికారులు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు,మోహన్ కుమార్, అతికా నాజ్, రమణ నాయక్, ప్రసాద్ వర్మ పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV