
హైదరాబాద్, 19 జూన్ (హి.స.), రాజధానిలో మరో భారీ ప్రీలాంచ్ మోసం బయటపడింది. తక్కువ ధరకే ప్లాట్లు ఇప్పిస్తామని దాదాపు 340మంది నుంచి రూ.70కోట్లు వసూలు చేసిన భారతీ బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధుల మీద కేసు నమోదైంది. సంగారెడ్డి జిల్లా భానూరులో 6.35 ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీ నిర్మిస్తున్నామని డబ్బు వసూలు చేసి తర్వాత రుణంకోసం భూమిని మరొకరికి బదిలీ చేశారు. బాధితుల ఫిర్యాదుతో భారతీ బిల్డర్స్ ఛైర్మన్ దూపాటి నాగరాజు, ఎండీ శివరామకృష్ణ, సునీల్ఆహుజా, ఆశిశ్కుమార్ ఆహుజాలపై బుధవారం కేసు నమోదైంది.
మణికొండకు చెందిన ప్రైవేటు ఉద్యోగి మహ్మద్ అసిఫ్ 2022లో ఇద్దరు సోదరులతో కలిసి ఇల్లు కొనేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో భారతీ బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భానూరులో ‘భారతీ గ్రీన్ ఎంపైర్ హైట్స్’ పేరుతో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలుసుకున్నారు. బుకింగ్ కోసం మాదాపూర్లోని కార్యాలయానికి వెళ్లగా భానూరులో ప్రాజెక్టు చేపట్టే సర్వేనంబరు 139/ఎ, 141/ఎ, 142/ఎ, 149/ఎ, 149/ఈ లోని స్థలం సంస్థదేనని భారతీ బిల్డర్స్ ప్రతినిధులు చెప్పారు. లేఅవుట్ అనుమతిసహా ఇతర ప్రభుత్వ అనుమతులు త్వరలోనే వస్తాయని నమ్మించారు. దీంతో అసిఫ్ సోదరులు డబ్బు కట్టారు. ఇలాగే దాదాపు 340 మందికి పైగా కొనుగోలుదారులనుంచి రూ.70కోట్లు వసూలు చేశారు. డబ్బు కట్టిన తర్వాత నిర్దేశిత స్థలంలో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ముందడుగు పడలేదు. ఆలస్యం జరుగుతోందని భావించిన కొనుగోలుదారులు డబ్బు తిరిగివ్వాలని సంస్థ ప్రతినిధులను కోరితే స్పందించలేదు. ఏడాదిపాటు చూసి విసిగిపోయిన బాధితులు తెరవెనుక ఏం జరిగిందని ఆరా తీయగా.. సదరు స్థలాన్ని సునీల్ కుమార్ ఆహుజా, ఆయన అనుబంధ సంస్థల పేరు మీదకు బదిలీ చేసినట్లు గుర్తించారు. దీనిపై భారతీ బిల్డర్స్ యాజమాన్యం వివరణ కోరగా..రూ.8 కోట్ల రుణం కోసం సునీల్ కుమార్ ఆహుజాకు ఏజీపీఏ చేసినట్లు బదులిచ్చింది.
సునీల్కుమార్ ఆహుజా సంస్థలు ఏజీపీఏని కొన్ని రోజుల తర్వాత సేల్డీడ్ చేసుకుని.. సదరు భూమిని భారతి బిల్డర్స్కు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు బయటపడింది. దీంతో బాధితులు సొసైటీగా ఏర్పడి.. సునీల్కుమార్ ఆహుజా, ఆయన సహాయకులతో ఏడాదిన్నరపాటు చర్చలు జరిపారు. ప్రయోజనం లేకపోవడంతో ఫిబ్రవరిలో హైదరాబాద్ సీపీ సజ్జనర్కు ఈ-మెయిల్ పంపారు. ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో తమను మోసగించిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాధితులు పెద్ద మొత్తంలో ఉన్నట్లు గుర్తించిన సజ్జనర్ ఆదేశాలతో మార్చి 3న సీసీఎస్లో తొలిసారి కేసు నమోదైంది. మోసం విలువ రూ.70కోట్లు ఉండడంతో సైబరాబాద్ ఈవోడబ్ల్యూ విభాగంలో కేసు రిజిస్టర్ అయ్యింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్