
వరంగల్, 19 జూన్ (హి.స.)
తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల
సమస్యలు, ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యం, ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీ ని వ్యతిరేకిస్తూ.. జూన్ 23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్ కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు వరంగల్ లోని ప్రెస్ క్లబ్ జరిగిన మీడియా సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్య నిర్వీర్యం అవుతుందని, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడని, ప్రభుత్వ పాఠశాలల ఎత్తివేతకు కుట్ర చేస్తూ... ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీకి కొమ్ముకాస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ABVP ఆధ్వర్యంలో జూన్ 23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్ కు పిలుపునిస్తున్నామని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలని కుట్ర చేస్తున్నాడని, అందుకే రేషనలైజేషన్ పేరుతో 23000 ల పాఠశాలలను మూసేందుకు కంకణం కట్టుకున్నాడని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని రాంబాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలకు ఏజెంట్లా వ్యవహరిస్తున్నాడని, విచ్చలవిడిగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం రెడ్ కార్పేట్ పరిచిందని ఎద్దేవా చేశారు. వెంటనే ప్రభుత్వం ఫీజుల దోపిడీని అరికట్టి, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని కోరారు. అలాగే ప్రైవేటు,కార్పొరేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు ఉచితంగా 25% సీట్లను అందించే విద్యాహక్కు చట్టాన్ని ప్రభుత్వం అటకెక్కించిందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..