
హైదరాబాద్, 19 జూన్ (హి.స.)
ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయాంజల్లో భూ వివాదం నేపథ్యంలో రెవెన్యూ అధికారులపై ఓ మహిళ దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. ప్రభుత్వ భూమిగా గుర్తించిన స్థలాన్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా విధులు నిర్వహించేందుకు వెళ్లిన అధికారులను అడ్డుకుని దౌర్జన్యానికి పాల్పడినట్లు అధికారులు ఆరోపించారు. తుర్కయంజాల్ పరిధిలోని సర్వే నంబర్ 338లో 1810 గజాల భూమిపై కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై ఆదిబట్ల పోలీసుల నివేదిక, సీఐ విజ్ఞప్తిని పరిశీలించిన ఆర్డీవో సంబంధిత భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అబ్దుల్లాపూర్మెట్ మండలానికి చెందిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రేమ్కుమార్, జీపీవో హన్మంతును ఉన్నతాధికారులను శుక్రవారం అక్కడికి పంపించారు.
అయితే అధికారులు వివాదాస్పద భూమి వద్దకు చేరుకున్న సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళ వారిని అడ్డుకుంది. మీరు నిజంగా అధికారులు అన్న నిర్ధారణ ఏమిటని ప్రశ్నిస్తూ వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. అధికారులు తమ గుర్తింపు కార్డులు చూపించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోగా, ఆరో ప్రేమ్కుమార్ గల్లా పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే ఐడీ కార్డును లాక్కొని దుర్భాషలాడినట్లు అధికారులు ఫిర్యాదులో తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము విధులు నిర్వహించేందుకు వచ్చినట్లు చెప్పినా వినకుండా బెదిరింపులకు, దౌర్జన్యానికి పాల్పడినట్లు రెవెన్యూ సిబ్బంది ఆరోపిస్తున్నారు. మరోవైపు జీపీవో హన్మంతు తనను కులం పేరుతో దూషించారని ఫిర్యాదులో పేర్కొనగా, ఆరొ ప్రేమ్కుమార్ కూడా తమపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదిబట్ల పోలీసులను ఆశ్రయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..