
హైదరాబాద్, 19 జూన్ (హి.స.)
ఖైరతాబాద్, సీఎం ప్రజావాణి కార్యక్రమం చొరవతో ఒక పసి ప్రాణం నిలిచింది. సీఎం ప్రజావాణి బృందం వేగంగా స్పందించడంతో పుట్టుకతోనే హృదయ సంబంధిత సమస్య ట్రాన్స్పొజిషన్ ఆఫ్ ది గ్రేట్ ఆర్ట్రీస్తో బాధపడుతున్న చిన్నారికి సకాలంలో శస్త్రచికిత్స జరిగింది. ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన దినసరి కూలీ ఆంజనేయులుకు ఇటీవల కుమార్తె గ్రేసీ జన్మించింది. పుట్టుకతోనే తీవ్ర అనారోగ్య సమస్యలు ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చూపించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు... సర్జరీకి భారీ ఖర్చు అవుతుందని చెప్పడంతో వారు సీఎం ప్రజావాణిని ఆశ్రయించారు. వెంటనే స్పందించిన సిబ్బంది... గ్రేసీని స్టార్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు విషయం తెలిపి.. వెంట్రిక్యులర్ సెప్టాల్ డిఫెక్ట్ శస్త్రచికిత్స జరిగేలా చర్యలు తీసుకున్నారు. చికిత్సకు అవసరమైన రూ.8 లక్షలు విడుదల చేయించారు. ప్రజావాణి బృందానికి ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్