
స్టేషన్ ఘన్పూర్, 19 జూన్ (హి.స.)
ప్రధానిగా రాహుల్, మరోసారి
ముఖ్యమంత్రిగా రేవంత్ కావడం పక్కా అంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలలో కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజా, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ అంబేద్కర్ స్పూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తున్న నాయకులు రాహుల్ గాంధీ గారని వెల్లడించారు.
దేశంలో అణగారిన వర్గాలపై దాడులను నిరసిస్తూ, బాధితులకు అండగా ఉంటూ పార్లమెంట్ లో గళం విప్పుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మాకు ఎదురే లేదు అన్నట్లు వ్యవహరించిన కేసీఆర్ కు ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారో రానున్న ఎన్నికలలో బీజేపీ, మోడీ ప్రభుత్వానికి అదే రీతిలో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రానున్న లోక్ సభ ఎన్నికలలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని, రాష్ట్రంలో మరోసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఆ దిశగా ప్రతీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికునిగా పని చేయాలని పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు