
హైదరాబాద్, 19 జూన్ (హి.స.)
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్
ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) విచారణలో భాగంగా క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ (Chikoti Praveen)ను సిట్ ఇవాళ సుదీర్ఘంగా విచారించింది. బంజారాహిల్స్లోని సిట్ కార్యాలయానికి హాజరైన చికోటి ప్రవీణన్ను వివిధ ప్రశ్నలు అడిగిన అధికారులు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను రికార్డు చేశారు.
విచారణ అనంతరం బయటకు వచ్చిన చీకోటి ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందంటూ డీజీపీకి ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో కేవలం కొందరివే కాకుండా, ఏకంగా 2 వేలకు పైగా ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేశారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులోని అసలు నిందితుల వెనుక ఉన్న నిజాలు, పూర్తి వివరాలు బయటకు రావాలంటే వారికి వెంటనే 'నార్కో అనాలసిస్ టెస్ట్' (Narco Analysis Test) నిర్వహించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాధాకిషన్రావు సంపాదించిన అక్రమ ఆస్తులపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఇక్కడి అధికారులు సరైన చర్యలు తీసుకోకపోతే, ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఈడీ, సీబీఐలకు లేఖ రాస్తానని చీకోటి ప్రవీణ్ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు