జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
Karimnagar


కరీంనగర్, 19 జూన్ (హి.స.) కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి కార్యాలయ పని తీరును పరిశీలించారు. అదనపు కలెక్టర్ జమ్మికుంట తహసీల్దార్ సందర్శన సందర్భంగా కార్యాలయంలో నిర్వహిస్తున్న సేవలు, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాలకు సంబంధించిన పలు రికార్డులను తహసీల్దార్ భాస్కర్తో కలిసి పరిశీలించారు. ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు తమ ధ్రువపత్రాలు, రెవెన్యూ సంబంధిత సేవల కోసం కార్యాలయానికి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తక్షణమే సేవలు అందించాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు సంబంధించిన ఏ దరఖాస్తు లేదా సమస్య కూడా పెండింగ్లో ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే లబ్ధిదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, పారదర్శకంగా సేవలు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande