మంత్రి శ్రీధర్ బాబుకు కవిత మాస్ వార్నింగ్
మంత్రి శ్రీధర్ బాబుకు కవిత మాస్ వార్నింగ్
kavita


హైదరాబాద్, 19 జూన్ (హి.స.)

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో నిర్వహించిన సింగరేణి ‘బాయిబాట’ కార్యక్రమం తీవ్ర రాజకీయ వేడిని రగిల్చింది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును టార్గెట్ చేస్తూ తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. కార్మికులకు, మాకు మధ్య రావాలని చూస్తే ఖబద్దార్. గతంలో చేసిన తప్పులకే నిన్ను వెంటబడి ఓడించాం. మళ్లీ అదే పునరావృతమైతే వచ్చే ఎన్నికల్లోనూ నిన్ను వెంటాడి మరీ ఓడిస్తాం అంటూ మంత్రి శ్రీధర్ బాబుకు ఆమె మాస్ వార్నింగ్ ఇచ్చారు.

బాయిబాట కార్యక్రమంలో భాగంగా కల్వకుంట్ల కవిత అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు అండర్గ్రౌండ్ మైన్లోకి దిగి కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. నల్లబొగ్గు బావుల్లో కార్మికులు పడుతున్న కష్టాలను, ప్రాణసంకట పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒక కార్మికుడు తను అనుభవిస్తున్న ఇబ్బందులను వివరిస్తుండగా కవిత తీవ్ర చలనానికి లోనై మైన్ లోపలే కంటతడి పెట్టారు. కార్మికులకు తాము ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని, హక్కుల సాధన కోసం పోరాడుతామని భరోసానిచ్చారు.

అనంతరం బొగ్గు గని వద్ద నిర్వహించిన భారీ గేట్ మీటింగ్లో కవిత మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంపై, సింగరేణి యాజమాన్యంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తర తెలంగాణకు ఆర్థిక వెన్నెముకగా నిలిచిన సింగరేణి సంస్థకు ప్రస్తుత ప్రభుత్వమే పెద్ద విద్రోహిగా మారిందని ధ్వజమెత్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande