
అనంతపురం, 19 జూన్ (హి.స.)వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి పెను సవాల్గా మారుతున్నాయి. అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టితో ఏటా రైతులకు నష్టాలే. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్నినో, సూపర్ ఎల్నినో హెచ్చరికలు కలవర పెడుతున్నాయి. సాధారణంగా ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి. ఇవి ఓ రకంగా ఇబ్బందే అయినా ఒకేసారి పెద్ద ఎత్తున వర్షం కురవడం అంతకు మించిన పెద్ద దెబ్బ. ఇటీవల అనంతపురంలో ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. ఒక్క రాత్రి కుంభవృష్టి కురవడంతో. పంటలు కొట్టుకుపోయాయి. అంతేకాదు భూములు కోతకు గురై నేల నిస్సారంగా మారే ప్రమాదముంది.
ఓవైపు సాగు పెట్టుబడి భారం పెరుగుతుంటే మరోవైపు వాతావరణంలో వస్తున్న మార్పులు అన్నదాతలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. వర్షాలు పడకపోవడం ఇబ్బందనుకుంటే ఒకేసారి భారీగా కురుస్తున్న వర్షాలు శాపాలుగా మారుతున్నాయి. అనంతపురం జిల్లాలో ఇటువంటి పరిస్థితులు నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా విత్తనం వేయడానికి పంట ఏపుగా పెరగడానికి 2 సెంటీమీటర్ల వరకు వర్షపాతం సరిపోతుంది. ఈ మోతాదులో వర్షం పడితే అటు పంటకు ఇటు నేలకు ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవల బత్తలపల్లిలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ధర్మవరం, కొత్తచెరువులో 5 సెంటీమీటర్ల వాన కురిసింది. ఫలితంగా వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. కుండపోతతో నేల పైపొర కొట్టుకుపోయి కోతకు గురవుతోంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV