సరోజినీదేవి కంటి. ఆసుపత్రిలో నీటి కొరత
సరోజినీదేవి కంటి. ఆసుపత్రిలో నీటి కొరత
సరోజినీదేవి కంటి. ఆసుపత్రిలో నీటి కొరత


హైదరాబాద్, 20 జూన్ (హి.స.)

నేత్ర సంబంధ రుగ్మతలతో బాధపడే వారికి మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రి సంజీవిని. ప్రైవేటులో రూ.వేల విలువైన క్లిష్టమైన కంటి ఆపరేషన్లు ఇక్కడ నయాపైసా ఖర్చులేకుండా చేస్తారు. దీంతో తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటకల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. అలాంటి ఆసుపత్రికి నీటి కొరత వెంటాడుతోంది. జలమండలి సరఫరా చేసే నీరు సరిపోవడం లేదు. లోఫ్రెషర్, సరఫరాలో హెచ్చుతగ్గులతో ఇన్పేషెంట్ రోగులు పడే పాట్లు వర్ణనాతీతం. నీటి ప్రభావం ఆపరేషన్ థియేటర్లపై పడుతుండడంతో సర్జరీల కోసం రోగులు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.

సేవలపై ప్రభావం..ఆసుపత్రి ఓపీలో ప్రతి రోజు దాదాపు 1200-1500 మంది వైద్య సేవలు పొందుతుంటారు. సమగ్ర కంటి పరీక్షల తర్వాత 100మందికి ఆపరేషన్లు చేయాల్సి ఉంటోంది. 10 ఆపరేషన్ థియేటర్లలో వీటిని నిర్వహిస్తారు. ఇందులో దాదాపు 40వరకు కేటరాక్ట్ (శుక్లాల) ఆపరేషన్లు ఉంటాయి. 2 నెలలుగా నీటి కొరత కారణంగా అత్యవసర ఆపరేషన్లు మాత్రమే వెంటనే చేయగలుగుతున్నారు. కేటరాక్ట్ లాంటి సర్జరీల తేదీలను వైద్యులు పొడిగిస్తున్నారు. ఈ కారణంగా దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు.జలమండలి సరఫరా చేసే తాగునీరు సరిపోక ట్యాంకర్ బుక్ చేద్దామంటే పెండింగ్ బిల్లుల కారణంగా ఆన్లైన్లో సాధ్యం కావడం లేదు. దీంతో ఆసుపత్రి వర్గాలు గురువారం జలమండలి అధికారులను బతిమిలాడి రూ.3,600 చెల్లించి 3 ట్యాంకర్లను తెప్పించారు. నీటి సరఫరాలో హెచ్చుతగ్గుదల వల్ల రోగుల పాట్లను వివరిస్తూ జలమండలికి వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande