
హైదరాబాద్, 20 జూన్ (హి.స.)
- హైదరాబాద్: వాతావరణం కాస్త చల్లబడితే చాలు.. వీధి చివరనున్న ఫాస్ట్ఫుడ్ సెంటర్లో చికెన్ ఫ్రైడ్ రైస్, మంచూరియా, ఇతర చిరుతిళ్లు లాగించేస్తుంటారు. కళాశాల ముగిశాక పిల్లలూ సరదాగా తింటూ కనిపిస్తుంటారు. ఈ ఫాస్ట్ఫుడ్ తయారీ వెనుక చీకటి కోణం హెచ్-ఫాస్ట్ పోలీసుల తనిఖీల్లో బయటపడింది. అపరిశుభ్ర వాతావరణంలో.. రోజుల తరబడి నిల్వ ఉంచిన చికెన్.. చాలా సార్లు వాడిన నూనెలో ఫ్రై చేసి ఫాస్ట్ఫుడ్ దుకాణాలకు సరఫరా చేస్తున్న గోదాముపై హెచ్-ఫాస్ట్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఇద్దర్ని అదుపులోకి తీసుకుని 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 90 లీటర్ల వంటనూనె, నిషేధిత కృత్రిమ రంగులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ శుక్రవారం కేసు వివరాలు వెల్లడించారు. చార్మినార్ ప్రాంతంలోని న్యూలాడ్ బజార్లో అల్ అక్బర్ ఫాస్ట్ఫుడ్ అండ్ గోదాములో అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు సమాచారం అందింది. ఫుడ్సేఫ్టీ అధికారులతో కలిసి పోలీసులు ఆకస్మికంగా గోదాముపై దాడి చేశారు. అపరిశుభ్ర వాతావరణం, నిషేధిత పదార్థాలతో చికెన్ ఫ్రై చేస్తున్నట్లు గుర్తించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు లేకుండానే గోదాము నిర్వహిస్తున్నారు. నిషేధిత కృత్రిమ రంగులు, పాడైన వంట నూనె పదేపదే వినియోగిస్తున్నారు. ఈ అపరిశుభ్ర వాతావరణంలో నిషేధిత పదార్థాలతో తయారుచేసిన చికెన్ ఫ్రైని ఫాస్ట్ఫుడ్ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. గోదాము నిర్వాహకుడు, మరొకర్ని అదుపులోకి తీసుకుని.. హుస్సేనీఆలం పోలీసుస్టేషన్లో అప్పగించారు. ఇలాంటి కల్తీ ఆహారాన్ని తీసుకోవడం వాంతులు, విరేచనాలు తదితర సమస్యలు వచ్చే అవకాశముందని డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్