
ఆదిలాబాద్, 20 జూన్ (హి.స.)
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామంలో పర్యటించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు నుగూరే పాండురంగ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. రైతు కుటుంబానికి ధైర్యం చెప్పండని కేసీఆర్ తమను ఇక్కడికి పంపించారని అన్నారు. రెండేళ్లు దయచేసి ధైర్యంగా బ్రతకండి, మళ్లీ కేసీఆర్ వచ్చి మిమ్మల్ని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటామని చెప్పమ్మన్నాడని తెలిపారు. పంట కొనలేదని రైతు విషం తాగి పడిపోతే ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు పరిస్థితి ఇదేనని అన్నారు. పాండురంగ్ కుటుంబానికి కనీసం రుణమాఫీ కాలేదు, రైతుబంధు కూడా పడటం లేదని చెప్పారు. చనిపోయిన ప్రతీ రైతుకి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కుటుంబంలో చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. ధాన్యం కొనక, లంచం సిస్టం పెట్టి, కనీసం మార్కెట్ యార్డులో నీళ్లు కూడా లేవని విమర్శించారు. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు