
విజయవాడ20 జూన్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం పేలుడు పదార్థాలను సేకరించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో రెండో నిందితుడిపై విజయవాడలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో అభియోగపత్రం (ఛార్జ్షీట్) దాఖలు చేసింది.
షేక్ మన్సూర్ అలియాస్ మహమ్మద్ అలీ అలియాస్ విజయకుమార్ను నిందితుడిగా పేర్కొంటూ ఎన్ఐఏ ఈ ఛార్జ్షీట్ను సమర్పించింది. అతనిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), భారతీయ న్యాయ సంహిత (BNS)లోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ అమానుల్లా అలియాస్ అబూబకర్ సిద్దిఖీకి మహమ్మద్ అలీ అత్యంత సన్నిహితుడని, కుట్రలో కీలక పాత్ర పోషించాడని ఎన్ఐఏ వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే అమానుల్లాపై ఫిబ్రవరి 2026లో ఎన్ఐఏ ఛార్జ్షీట్ దాఖలు చేయగా, ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశారు.
2025లో అమానుల్లా నివాసంలో జరిపిన సోదాల్లో పేలుడు పదార్థాలు, ఇతర కీలక సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అమానుల్లానే మహమ్మద్ అలీని ఉగ్రవాదం వైపు ప్రేరేపించి, బాంబుల తయారీలో శిక్షణ ఇచ్చాడని దర్యాప్తులో తేలింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఒక రహస్య ప్రాంతానికి పేలుడు పదార్థాలను తరలించడంలో అలీ సహకరించాడని, అతను నకిలీ పత్రాలతో తన గుర్తింపును దాచి నివసిస్తున్నాడని ఎన్ఐఏ పేర్కొంది.
ఒక వర్గానికి చెందిన నేతలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయడం ద్వారా సమాజంలో భయాందోళనలు సృష్టించి, దేశంలో షరియా చట్టాన్ని స్థాపించాలనే ఎజెండాతో వీరిద్దరూ కుట్ర పన్నారని ఎన్ఐఏ వివరించింది. కాగా, మహమ్మద్ అలీ 1999లో తమిళనాడులో జరిగిన బాంబు పేలుళ్ల కేసులోనూ నిందితుడిగా ఉండి, పరారీలో ఉన్నట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi