
హైదరాబాద్, 20 జూన్ (హి.స.)
హైదరాబాద్కు చెందిన ఓ విద్యార్థి ఫిన్లాండ్లో గత 45 రోజులుగా కనిపించకుండా పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హయత్నగర్కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి (18) అదృశ్యంపై అతని తల్లిదండ్రులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, విద్యార్థి ఆచూకీని కనిపెట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
మణిదీప్ రెడ్డి 2025 మార్చిలో ఫిన్లాండ్లోని లాహ్టి నగరంలో ఉన్న లూట్ యూనివర్సిటీలో బీటెక్ కోర్సులో చేరాడు. మే 5వ తేదీన అతడు తన తల్లితో చివరిసారిగా ఫోన్లో మాట్లాడాడు. తాను ఒక బేకరీలో ఉన్నానని, రూంకి తిరిగి వెళతానని చెబుతూనే, డబ్బులు కావాలని కోరాడు. అయితే, ఆ తర్వాత నుంచి మణిదీప్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
మణిదీప్ ఆచూకీ కోసం అతడి స్నేహితులు, రూమ్మేట్స్, యూనివర్సిటీ అధికారులను సంప్రదించినా ఎటువంటి ఫలితం లభించలేదు. హెల్సింకిలోని భారత రాయబార కార్యాలయం, స్థానిక అధికారులు స్పందించడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ మణిదీప్ తల్లిదండ్రులు గుజ్జ మరనాత, ముత్యం రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై జూన్ 18న జస్టిస్ బి. విజయ్సేన్ రెడ్డి విచారణ జరిపారు. కేంద్ర ప్రభుత్వం, ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం, తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi