
కలకత్తా, 23 జూన్ (హి.స.)పశ్చిమ బెంగాల్ అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో వర్గ పోరు వీధిన పడింది. మమతా బెనర్జీ స్థానంలో అరూప్ రాయ్ను కొత్త పార్టీ అధ్యక్షుడిగా తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రకటించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘానికి (EC) లేఖ రాశారు. జూన్ 20 నాటి పార్టీ ఆఫీస్ బేరర్లు, జాతీయ కార్యవర్గ కమిటీ (NWC) జాబితాను ఈసీకి సమర్పించిన ఆమె, అందులో తానే టీఎంసీ అధ్యక్షురాలినని స్పష్టం చేశారు. ఈ జాబితా ప్రకారం అభిషేక్ బెనర్జీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, సుబ్రతా బక్షి ఉపాధ్యక్షుడిగా, డెరెక్ ఒబ్రెయిన్ జాయింట్ సెక్రటరీగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. మరోవైపు పార్టీ క్రమశిక్షణా కమిటీ రంగంలోకి దిగి అరూప్ రాయ్, ఫిర్హాద్ హకీమ్, అరూప్ బిశ్వాస్ సహా పలువురు సీనియర్ నేతలకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.అయితే అసెంబ్లీ ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం మాత్రం అరూప్ రాయ్ను కొత్త అధ్యక్షుడిగా ప్రకటిస్తూ 30 మందితో కూడిన కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది. మమతా బెనర్జీని తాము గౌరవిస్తామని, ఆమె ఒక మెంటార్గా ఉంటూ తమకు మార్గదర్శిగా వ్యవహరించాలని వారు కోరారు. టీఎంసీకి చెందిన మొత్తం 80 మంది ఎమ్మెల్యేలలో కనీసం 58 మంది ఎమ్మెల్యేలు నాయకత్వంపై తిరుగుబాటు చేసి విడిగా చీలిక వర్గాన్ని ఏర్పాటు చేయడంతో ఈ సంక్షోభం తలెత్తింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi