దేశంలోని టాప్ 10 కంపెనీల విలువ కెనడా జీడీపీ కంటే ఎక్కువ
దేశంలోని టాప్ 10 కంపెనీల విలువ కెనడా జీడీపీ కంటే ఎక్కువ
Corporate


*ముంబై, , 24 జూన్ (హి.స.)

గత ఏడాది కాలంలో దేశంలోని అత్యంత విలువైన 10 కార్పొరేట్ సంస్థల మొత్తం మార్కెట్ విలువ రూ. 11 లక్షల కోట్లు తగ్గినప్పటికీ, వాటి వ్యాపార సామ్రాజ్యం మాత్రం ప్రపంచ దేశాల కంటే శక్తివంతంగా నిలిచింది. తాజా 'బర్గుండి ప్రైవేట్ హురున్ ఇండియా 500' నివేదిక ప్రకారం.. దేశంలోని అత్యంత విలువైన టాప్-10 కంపెనీల ఉమ్మడి మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 86 లక్షల కోట్లు (908 బిలియన్ డాలర్లు)గా ఉంది. ఏడాది క్రితం ఈ విలువ రూ. 97 లక్షల కోట్లుగా ఉన్నప్పటికీ.. ఇది కెనడా ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) కంటే ఎక్కువగా ఉండటం విశేషం. అంతేకాదు, ఈ విలువ దేశ మొత్తం జీడీపీలో నాలుగవ వంతుకు (25 శాతం) సమానంగా ఉండటమే కాకుండా, దేశంలోని టాప్ 500 కంపెనీల మొత్తం సంపదలో 27 శాతం వాటాను కలిగి ఉంది. గత దశాబ్ద కాలంలో ఈ టాప్-10 సంస్థల విలువ 3.5 రెట్లు పెరగ్గా, అందులో ఏడు కంపెనీలు గత ఐదేళ్లుగా తమ టాప్ స్థానాలను పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నాయి.

రూ. 19.36 లక్షల కోట్లతో అగ్రస్థానంలో రిలయన్స్

దేశీయ కార్పొరేట్ రంగంలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఎల్) రూ. 19.36 లక్షల కోట్ల మార్కెట్ విలువతో తన నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. గత ఏడాది కాలంలో మార్కెట్ ఒత్తిడిలో ఉన్నా కూడా రిలయన్స్ ఏకంగా రూ. 1.8 లక్షల కోట్లకు పైగా విలువను పెంచుకుంది. ఈ జాబితాలోని మరే కంపెనీ కూడా ఈ స్థాయిలో సంపదను సృష్టించలేదు. దేశంలోని టాప్-10 కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఐదవ వంతు (దాదాపు 20 శాతం) వాటా ఒక్క రిలయన్స్ సంస్థదే కావడం కంపెనీ ఆధిపత్యానికి నిదర్శనం.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande