
అరుణాచల్ ప్రదేశ్, 24 జూన్ (హి.స.)
అరుణాచల్ ప్రదేశ్లో కురిసిన
అతిభారీ వర్షాలు జలప్రళయాన్ని సృష్టించాయి. ముఖ్యంగా కేయీ పన్యోర్, లోయర్ సుబన్సిరి జిల్లాల్లో కొండచరియలు విరిగిపడి ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించాయి. యాజలి, పోసా, యీయీ గ్రామాలు వరద నీటిలో మునిగిపోగా, ఇళ్లు, వ్యవసాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పోసాలోని ఎన్ఐఈపీసీఓ కాలనీలో 15 నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. ఒక ప్రధాన రహదారి వంతెన కూడా వరద ఉద్ధృతికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వర్షపాతం తక్కువ సమయంలోనే కురవడంతో నదుల నీటిమట్టం ఒక్కసారిగా పెరిగి ఈ పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. పలువురు స్థానికులు గల్లంతైనట్లు సమాచారం ఉండగా, సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. మరోవైపు, అరుణాచల్లోని వరదల ప్రభావంతో దిగువ ప్రాంతమైన అసోంలోనూ వరద ముప్పు పొంచి ఉండటంతో అక్కడి ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు