ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో EWS ఫీజుల భారం.. పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో EWS ఫీజుల భారం.. పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Supreme court


న్యూఢిల్లీ, 24 జూన్ (హి.స.)

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని భారీ ఫీజులను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) అభ్యర్థులు భరించలేకపోతున్నారంటూ, వారి ఫీజులను నియంత్రణ, రాయితీలపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు (Supreme Court) తిరస్కరించింది. ప్రైవేట్ వైద్య విద్యా సంస్థల్లోని ఫీజుల నిర్మాణంలో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేస్తూ ధర్మాసనం పిటిషన్ను తోసిపుచ్చింది. విచారణ సందర్భంగా ధర్మాసనం పిటిషన్ను పరిశీలించిన అనంతరం.. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రైవేట్ కాలేజీల నిర్వహణ, వాటి మౌలిక వసతులు, ఫీజుల నిర్ధారణ అనేవి ఆయా యాజమాన్యాలు, సంబంధిత రాష్ట్రాల ఫీజు నియంత్రణ కమిటీల పరిధిలోకి వస్తాయని కోర్టు అభిప్రాయపడింది. ఓ అర్హత కలిగిన అభ్యర్థి ప్రైవేట్ సంస్థలో సీటు పొందినప్పుడు అక్కడి నిబంధనలకు కట్టుబడి ఉండాలని, ఫీజులు చెల్లించలేని పక్షంలో ప్రభుత్వ పథకాలు, స్టడీ లోన్లను ఆశ్రయించాలే తప్ప కోర్టుల ద్వారా ఫీజులను తగ్గించలేమని పేర్కొంటూ పిటిషన్ను డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రైవేటు కాలేజీల్లో సీట్లు సాధించిన పేద, మధ్యతరగతి EWS విద్యార్థులకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande