
లక్నో, 23 జూన్ (హి.స.)లఖ్నవూలోని అలీగంజ్లో 15 మంది ప్రాణాలు బలిగొన్న భారీ అగ్నిప్రమాదానికి సంబంధించిన భవనం వెనుక షాకింగ్ నిజాలు అధికారిక రికార్డుల ద్వారా వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా అనధికారికంగా నిర్మించిన ఈ మూడు అంతస్తుల వాణిజ్య భవనానికి 2016 మే 10న లఖ్నవూ డెవలప్మెంట్ అథారిటీ (LDA) కూల్చివేత ఆదేశాలు జారీ చేసింది. అయితే, కేవలం రెండు నెలల వ్యవధిలోనే (2016 జూలై 5న) అధికారులు ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవడం గమనార్హం. దాదాపు 1,992 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలానికి 2014 ఆగస్టు 20న కేవలం నివాస అవసరాల కోసమే అనుమతి లభించింది. అయినప్పటికీ, నివాస స్థలంగా అనుమతి తీసుకుని, దానికి విరుద్ధంగా భవనంలో అనధికారిక వాణిజ్య నిర్మాణాలను చేపట్టారు. దీనిపై LDA కేసు నమోదు చేసి కూల్చివేతకు ఆదేశించినప్పటికీ, యజమానులు ఆ నోటీసును సవాలు చేయడంతో జారీ చేసిన రెండు నెలల లోపే అధికారులు ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. ఏ పరిస్థితుల్లో అధికారులు ఈ నిర్ణయాన్ని మార్చుకున్నారనే దానిపై ఇప్పుడు తీవ్ర విచారణ జరుగుతోంది.అలీగంజ్లోని ఉషా మెహతా మార్గ్లో ఉన్న ఈ భవనంలోని రెండవ అంతస్తులో యానిమేషన్ కోచింగ్ సెంటర్ నడుస్తోంది, ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు క్లాసుల్లో ఉండటంతో మరణించిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ భవనానికి అత్యవసర నిష్క్రమణ (Emergency Exit) మార్గం లేదు. పైగా టెర్రస్ వైపు వెళ్లే దారి బ్లాక్ అయి ఉండటం, బయోమెట్రిక్ లాక్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం వల్ల విద్యార్థులు లోపలే చిక్కుకుపోయి ఊపిరాడక మరణించారు. భవనం ఎత్తు 15 మీటర్ల కంటే తక్కువ ఉండటం వల్ల దీనికి ఫైర్ NoC (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) తప్పనిసరి కాకపోవడాన్ని యజమానులు ఆసరాగా చేసుకున్నారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఈ ఘోరకలివికి కారణమైన లోపాలపై దర్యాప్తు చేయడానికి ఇద్దరు సభ్యులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. అలాగే బాధ్యులైన నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేయడమే కాకుండా, భవన యజమానిని అరెస్ట్ చేసి భవనానికి సీల్ వేశారు. మృతుల కుటుంబాలకు ₹5 లక్షలు, గాయపడిన వారికి ₹50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi