
ఖమ్మం, 24 జూన్ (హి.స.)
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల
పాలనలో చేసిన అప్పులకు సంబంధించి అసలు వడ్డీ చెల్లిస్తూనే ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పదేళ్లపాటు అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ కొడుకు, అల్లుడు, కూతురు రాష్ట్రంలో తిరుగుతూ గాలి కబుర్లు గాలి మాటలు చెబుతున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంలో ఈనెల 30వ తేదీన నిర్వహించనున్న రైతు ఆశీర్వాద మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం నియోజకవర్గస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేని1967 సంవత్సరంలో ప్రారంభమైన నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టులు చెక్కుచెదరకుండా లక్షలాది ఎకరాలకు నేటికీ సాగునీరు అందిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే టెక్నాలజీ ఉన్న సమయంలో బీఆర్ఎస్ నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు రెండు సంవత్సరాలకే కుంగి పోయిందని చెప్పారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. పాలన అంటే బీఆర్ఎస్ హయాంలో మాదిరిగా నలుగురు మనుషులు దోచుకోవటం కాదని, నాలుగు కోట్ల ప్రజలకు మేలు చేయటం అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేసీఆర్ కుమార్తె చెబుతుంటే ఆ కుటుంబ సభ్యులు తల ఎత్తుకొని ఎలా బయటికి వస్తున్నారని ఎద్దేవా చేశారు. సొంత పేపర్, సోషల్ మీడియాలో అడ్డగోలు అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కెసిఆర్ చేసిన రూ. 8 లక్షల కోట్ల అప్పుకు సంబంధించి ప్రతి సంవత్సరం అసలు వడ్డీ 76 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఒకవైపు చెల్లిస్తూనే, మరో వైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వివరించారు. ప్రజలకు సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, గృహాలకు ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, నిరుద్యోగులకు 76 వేల ఉద్యోగాల కల్పన, మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలు తదితర పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు