
మంచిర్యాల, 25 జూన్ (హి.స.)
ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం లక్షెట్టిపేట 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వార్డులు, రిజిస్టర్లు, ల్యాబ్, పరిసరాలను పరిశీలించి అధిక శాతం నమోదు అవుతున్న వ్యాధులు, అందిస్తున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. వైద్య రంగ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలను ఆధునికరిస్తూ, ఆధునిక సాంకేతిక పరికరాలను సమకూర్చి ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. వర్షాకాలం అయినందున వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన మందుల నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది నిధుల పట్ల సమయపాలన పాటించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని తెలిపారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి భోజనశాల, అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యా రంగంలో ఆచరణాత్మక మార్పులను తీసుకువస్తూ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు