
హైదరాబాద్, 25 జూన్ (హి.స.)
మొహర్రం మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం (జూన్ 26) పాతబస్తీలో ప్రతిష్టాత్మక 'బీబీ కా ఆలమ్' ఊరేగింపు జరగనుంది. ఈ నేపథ్యంలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నగర ట్రాఫిక్ పోలీసులు భారీ స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. శుక్రవారం మధ్యాహ్నం 12:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని అధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
ప్రధాన ట్రాఫిక్ మళ్లింపులు ఇవే..
ఊరేగింపు సాగే మార్గాలను బట్టి ఆయా సమయాలు, ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించనున్నారు. బీబీ కా అలవా & ఏతేబార్ చౌక్ మార్గాల్లోకి వాహనాలను అనుమతించరు. ట్రాఫిక్ను సునారగల్లీ టీ జంక్షన్ వద్ద దబీరురా వైపు, ఏతేబార్ చౌక్ వద్ద కోట్లా అలీజా లేదా పురాణీ హవేలీ వైపు మళ్లిస్తారు. చార్మినార్, గుల్జార్ హౌజ్, మదీనా చౌరస్తాల వైపు వాహనాలకు ప్రవేశం లేదు. ఈ ట్రాఫిక్ను మిట్టీ కా షేర్, ఘన్సీ బజార్, సిటీ కాలేజ్ వైపు మళ్లిస్తారు. గంగా నగర్ నాలా, బీబీ బజార్, పురాణీ హవేలీ, మొఘల్పురా వైపు నుంచి వచ్చే వాహనాలను చత్తా బజార్, పారిస్ కేఫ్ లేదా తలాబ్ కట్ట వైపు పంపుతారు. సాలార్ జంగ్ మ్యూజియం, శివాజీ బ్రిడ్జ్ వైపు వాహనాలను అనుమతించరు. చాదరాఘాట్ రోటరీ మీదుగా వచ్చే వాహనాలను కోటి లేదా రంగమహల్ వైపు, నయాపూల్ వద్ద ట్రాఫిక్ను మదీనా వైపు మళ్లిస్తారు. షేక్ ఫైజ్ కమాన్, హాఫెజ్ డంకా మసీదు, జబ్బార్ హోటల్ వద్ద, అలాగే హాఫెజ్ డంకా మసీదు వద్ద వాహనాలను ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లోకి పంపుతారు. టీజీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ జిల్లా బస్సులను శుక్రవారం ఉదయం 10:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు రంగమహల్, అఫ్టైల్గంజ్ వైపునకు మళ్లిస్తారు. ఊరేగింపు ముగిసే వరకు కాళీ ఖబర్-మీరాలం మండి రోడ్డుపైకి బస్సులకు ప్రవేశం ఉండదు. నగర పౌరులు, వాహనదారులు ఈ ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని, గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ విభాగం సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు