
హైదరాబాద్, 24 జూన్ (హి.స.)
ఆర్టీసీ ప్రభుత్వ విలీనం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ జాతీయ మజ్దాూర్ యూనియన్ (టీజేఎంయూ) ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్ను పోలీసులు అరెస్టు చేశారు. బస్ భవన్ (Bus Bhavan) నుంచి ఆయన్ను తరలించారు. దీంతో అక్కడ కాసేపు ఆర్టీసీ యూనియన్ నేతలు, పోలీసులకు మధ్య టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కాగా ప్రభుత్వం ఎన్నికల పేరుతో ఆర్టీసీ విలీనాన్ని తాత్సారం చేస్తోందని యూనియన్ ఎన్నికలను తక్షణమే ఆపి విలీనం ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ హనుమంతు ముదిరాజ్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాన్ని తక్షణం నెరవేర్చాలని హనుమంతు డిమాండ్ చేశారు. మేడే రోజున కూడా యూనియన్ల నాయకులతో జరిపిన చర్చల్లో అంతా విలీనమే మొదట చేయాలని కోరామని స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం మాట తప్పి ఎన్నికలకు వెళ్లడం ద్వారా డబుల్ గేమ్ ఆడుతోందన్నారు. అందుకే విలీనం చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రివర్గ ఉప సంఘం మంత్రులకు విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు