రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యూవల్ సీఎం.. కేటీఆర్
రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యూవల్ సీఎం.. కేటీఆర్
Ktr


ఖమ్మం, 24 జూన్ (హి.స.)

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రెగ్యులర్ సీఎం కాదని, రెన్యూవల్ సీఎం అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన సదస్సు, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్, హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణకు చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకోగా, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ఆయనకు గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎంఆర్ గార్డెన్లో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 72 లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్ల రైతుబంధు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు ఢిల్లీ వెళ్లి, అక్కడి పెద్దలకు కప్పం కడుతూ గులాంగిరి చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా తెలంగాణ ప్రజలకు చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమీ చేయలేదని ఆరోపించారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి, సీతారామ ప్రాజెక్టు పనుల్లో 80 శాతం పూర్తిచేసిన ఘనత కూడా కేసీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు.

టీజీఐఐసీ భూముల కేటాయింపుల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ఎకరానికి తక్కువ ధరకు భూములు కేటాయించడం వెనుక ఎవరి హస్తం ఉందో వెల్లడించాలని ప్రశ్నించారు. అలాగే సీతారామ ప్రాజెక్టు మట్టిని అక్రమంగా తరలించడంపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande