దాతలందరికీ సమాన గౌరవం ఇవ్వాలి: టీటీడీకి కుప్పాల గిరిధర్ సూచన
దాతలందరికీ సమాన గౌరవం ఇవ్వాలి: టీటీడీకి కుప్పాల గిరిధర్ సూచన
TTD Donation Policy Sparks Debate Donors Giving


తిరుపతి,, 24 జూన్ (హి.స.) శ్రీవారికి విరాళాలు అందించే దాతలు అందరినీ సమానంగా చూడాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. రూ.10 వేల శ్రీవాణి టిక్కెట్ దర్శనం, రూ.10 లక్షల విరాళాల అందజేసే దాతలకు శ్రీవారి దర్శనంలో వ్యత్యాసం ఉంటుందన్నారు. రూ.10,500 చెల్లించిన శ్రీవాణి దాతలకు కులశేఖర పడి వరకు స్వామి వారి దర్శనం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. రూ.10 లక్షలు, అంతకంటే ఎక్కువ విరాళం ఇచ్చిన దాతలకు లఘు దర్శనం మాత్రమే కల్పిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానంపై భక్తుల్లో తీవ్ర చర్చ జరుగుతోందని తెలిపారు.

స్వామి వారికి భారీ విరాళాలు ఇచ్చే దాతల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని కుప్పాల గిరిధర్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీవాణి టిక్కెట్ల ద్వారా రోజుకి సుమారు 1,500 మంది స్వామి వారి దర్శనం చేసుకుంటారని అన్నారు. రూ.10 లక్షలు, అంతకంటే ఎక్కువ విరాళాలు ఇచ్చిన దాతలు రోజుకు 200 నుంచి 300 మంది మాత్రమే ఉంటారని వివరించారు. స్వామి వారికి విరాళాలు ఇచ్చిన దాతలందరినీ సమానంగా చూడాలని ఈ సందర్భంగా టీటీడీకి ఆయన విజ్ఞప్తి చేశారు. తాను కూడా ఇప్పటి వరకు టీటీడీకి రూ.50 లక్షల వరకు విరాళాలు అందజేశానని చెప్పారు.

శ్రీవాణి దాతలకు కల్పిస్తున్న కులశేఖర పడి దర్శనాన్ని భారీ విరాళం అందిస్తున్న దాతలకు కూడా కల్పించాలని టీటీడీని ఆయన డిమాండ్ చేశారు. అలా కాకుంటే టీటీడీకి విరాళాలు ఇచ్చే వారి సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దర్శన విధానాలపై పునరాలోచన చేయాలని టీటీడీకి ఆయన సూచించారు. దాతల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని టీటీడీని ఈ సందర్భంగా కుప్పాల గిరిధర్ కుమార్ అభ్యర్థించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande