తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ
తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ
తిరుమల


తిరుమల, 24 జూన్ (హి.స.)

కలియుగ వైకుంఠం దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం సమయానికి శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి దర్శన టోకెన్లు లేని సాధారణ భక్తులకు స్వామివారి సర్వదర్శనం (Free Darshan) లభించడానికి సుమారు 10 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న (మంగళవారం) ఒక్కరోజే మొత్తం 84,235 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. అందులో 29,745 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.18 కోట్లుగా నమోదైంది.

ఇదిలావుండగా.. శ్రీవాణి ట్రస్ట్ (SRIVANI Trust) బ్రేక్ దర్శన టికెట్ల విషయంలో టీటీడీ (TTD) ఐటీ విభాగం చేసిన ఒక చిన్న పొరపాటు భక్తులను తీవ్ర అయోమయానికి, ఇబ్బందులకు గురిచేసింది. బుధవారం నాటి శ్రీవాణి భక్తుల టికెట్లలో దర్శన సమయం సాయంత్రం 4:00 గంటలకు (4:00 PM) బదులుగా.. పొరపాటున ఉదయం 4:00 గంటలకు (4:00 AM) అని ప్రింట్ అయింది. దీంతో టికెట్లపై ఉన్న సమయాన్ని నమ్మి, దేశం నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది భక్తులు తెల్లవారుజామునే చలిలో క్యూలైన్ల వద్దకు చేరుకున్నారు. అయితే, ఆ సమయానికి శ్రీవాణి దర్శన స్లాట్ లేకపోవడంతో క్యూలైన్ల వద్ద ఉన్న టీటీడీ సిబ్బంది భక్తులను లోపలికి అనుమతించలేదు.

తాము టికెట్లో ఉన్న టైమింగ్స్ ప్రకారమే వచ్చామని, తమను లోపలికి వదలాలంటూ భక్తులు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో క్యూలైన్ల వద్ద కాసేపు ఉద్రిక్తత, గందరగోళ వాతావరణం నెలకొంది. చివరకు టికెట్ ప్రింటింగ్లోనే సాంకేతిక లోపం వల్ల తప్పు జరిగిందని టీటీడీ కౌంటర్ అధికారులు గుర్తించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించారు. ఉదయం జరిగిన వీఐపీ బ్రేక్ దర్శన (VIP Break Darshan) సమయంలోనే ఈ శ్రీవాణి భక్తులందరినీ ప్రత్యేకంగా అనుమతించడంతో గందరగోళం సర్దుమణిగింది. సాంకేతిక లోపాలపై భక్తులు అసహనం వ్యక్తం చేయగా, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామని అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande