
హైదరాబాద్, 24 జూన్ (హి.స.)
ఎండలు, ఉక్కపోతలతో ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తీపి కబురు అందించింది. రాబోయే వారం రోజుల పాటు (జూన్ 30 వరకు) రెండు రాష్ట్రాలలోనూ నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. ఈ కాలంలో అనేక ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ విస్తారమైన వర్షాల కారణంగా రాబోయే రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో కూడిన ఉత్తర కోస్తా ప్రాంతాలలో నేడు (24న) అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 29, 30 తేదీలలో ఇక్కడ వర్షాల తీవ్రత మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వంటి దక్షిణ కోస్తా జిల్లాలలో ప్రారంభంలో మోస్తరు వర్షాలు ఉండి, జూన్ 28 నుండి 30 మధ్య విస్తారంగా భారీ వర్షాలు కురిసే వీలుంది. రాయలసీమ ప్రాంతంలో ఆరంభంలో తక్కువగా ఉన్నప్పటికీ, వారం చివర్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలో నేడు (24న) ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ సహా ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వారం చివరి నాటికి హైదరాబాద్, రంగారెడ్డితో పాటు దక్షిణ జిల్లాలకు కూడా ఈ వర్షాలు విస్తరించనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi