
, 25 జూన్ (హి.స.)
కర్నూలు
, ‘‘కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. ఆ ఘాతుకాలు బయట పడడంతో ప్రజలను మభ్యపెట్టేందుకు గొడ్డలి పార్టీ నాయకుడు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు’’ అని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ఆయన సభలో మాట్లాడారు. మిత్రుడు, డిప్యూటీ సీఎం వపన్ కల్యాణ్ లక్ష్యంగా గొడ్డలి పార్టీ దుష్ప్రచారం చేస్తూ, పని గట్టుకొని కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. విజయవాడ సాయికృష్ణ అదృశ్యం ఘటనలో కులాలు ఆపాదిస్తూ విషం చిమ్ముతున్నారని, అన్నీ ఘటనలకు కులం రంగు పూసి రెచ్చగొడుతున్నారన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
‘‘గొడ్డలి పార్టీ అధికారంలో ఉండగా ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు. ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి మెగా డీఎస్సీతో 16,500 మంది నిరుద్యోగ యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలిచ్చాం. ఉద్యోగం వచ్చిన యువత సంతోషంతో ఉంటే, ఏడాది తరువాత పేపర్ లీక్ అయిందని ఒకసారి, పోస్టులు ఇవ్వలేదని మరోసారి దుష్ప్రచారం, కుట్రలకు గొడ్డలి పార్టీ తెర తీసింది. టీచర్ పోస్టుల భర్తీపై మంత్రి లోకేశ్ సవాల్ విసిరితే తోక ముడిచారు. హామీ ఇవ్వకపోయినా 10,800 మంది ఉద్యోగులకు సీపీఎస్ నుంచి పాత పెన్షన్ స్కీంకు తీసుకొచ్చాం. సీమకు సాగునీటి ప్రాజెక్టులు తెచ్చిందీ, ఫ్యాక్షన్ను అంతం చేసిందీ టీడీపీ. మరి సీమ ప్రజలకు గొడ్డలి పార్టీ చేసిందేమిటి? రాయలసీమ లిఫ్ట్కు వారి పాలనలోనే ఎన్జీటీ స్టే ఇస్తే.. ఆ స్టే వెకేట్ చేయించలేని వ్యక్తులు సీమ లిఫ్టు గురించి మాట్లాడుతున్నారు. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేనివాళ్లు సీమ గురించి మాట్లాడుతున్నారు. తుంగభద్ర గేట్ కొట్టుకుపోతే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేశాం. నేడు కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులతో కలసి తుంగభద్ర గేట్లను ప్రారంభిస్తున్నాం. రాష్ట్రానికి పరిశ్రమలు, ఆదాయం తేవాలని మేం రేయింబవళ్లూ ఆలోచిస్తుంటే.. గొడ్డలి పార్టీ మాత్రం రాత్రీపగలు కుట్రలు, కుతంత్రాలు చేస్తూ, రాష్ట్రాన్ని కులం, మతం, వర్గాలవారీగా విడదీసేలా విషం చిమ్ముతోంది’’ అని ధ్వజమెత్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ