
ఆసిఫాబాద్, 25 జూన్ (హి.స.)
వైద్య చికిత్సల కొరకు నిరంతరం ఆసుపత్రికి వచ్చే ప్రజలకు శుద్ధ జలాన్ని అందించాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. గురువారం జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలోని ఎల్లా గౌడ్ తోటలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో, హైదరాబాద్ కు చెందిన పవర్ మెక్ ఇండస్ట్రీ వారు అందించిన ఆర్.ఓ.వాటర్ ప్లాంట్ ను, ఆసుపత్రి పర్యవేక్షకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించాలని, ఆ దిశగా ఆసుపత్రి సిబ్బంది చర్యలు తీసుకోవాలని తెలిపారు. సామాజిక బాధ్యతలలో భాగంగా ఆర్.ఓ.వాటర్ ప్లాంట్ ను అందించడం అభినందనీయమని, వాటర్ ప్లాంట్ ప్రతిరోజు పనిచేసేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. అనంతరం పట్టణంలోని 11వ వార్డు బాలాజీ నగర్ లో బూత్ స్థాయి అధికారులు పంపిణీ చేస్తున్న ఎన్యుమరేషన్ ఫారాల ప్రక్రియను పరిశీలించారు. బూత్ స్థాయి అధికారులు ఎన్యుమరేషన్ ఫారం అందించి, నింపిన తర్వాత తిరిగి సేకరించి యాప్ లో స్పష్టంగా వివరాలు నమోదు చేయాలని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు