డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో భారీ స్కామ్.. జీహెచ్ఎంసీ ఉద్యోగిని సహా ముగ్గురు అరెస్ట్
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో భారీ స్కామ్.. జీహెచ్ఎంసీ ఉద్యోగిని సహా ముగ్గురు అరెస్ట్
Police


హైదరాబాద్, 25 జూన్ (హి.స.)

పేదలకు ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పిస్తామంటూ అమాయకులను నమ్మించి భారీ మోసానికి పాల్పడిన ఘరానా ముఠా గుట్టును ఆల్వాల్ పోలీసులు రట్టు చేశారు. ఈ స్కామ్కు సంబంధించిన ఏడుగురు నిందితులను గుర్తించిన పోలీసులు వారిలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో జీహెచ్ఎంసీ ఉద్యోగి తిమ్మరి పుష్పలత ఏ2 గా ఉన్నట్లు మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ గురువారం మీడియాకు వెల్లడించారు. ఆమెతో పాటు ఆమె కుమారుడు విశాల్ ఏ3, జిరాక్స్ సెంటర్ యజమాని మహేందర్ సింగ్ ఏ6 లను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. వారి వద్ద నుంచి 79 నకిలీ డబుల్ బెడ్ రూమ్ పత్రాలతో పాటు మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వాటిని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ స్కామ్ ప్రధాన నిందితుడు జైరాజ్ ఇటీవల మరణించిట్లు పోసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.

గతంలో జీహెచ్ఎంసీ (GHMC) లో పనిచేసి, ప్రస్తుతం కలెక్టరేట్ ఆఫీస్లోని అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేస్తున్న తిమ్మరి పుష్పలత, ఆమె కుమారుడు విశాల్ ఈ మోసంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. బాధితులకు నమ్మకం కలిగించడం కోసం వీరు ప్రభుత్వ ముద్రలతో కూడిన నకిలీ అలాట్మెంట్ ప్రొసీడింగ్ కాపీలను సృష్టించి ఇచ్చారని ఇందుకోసం వాడిన నకిలీ రబ్బర్ స్టాంపులు తయారు చేసిన వారిని, ఫేక్ కాపీలను జిరాక్స్ తీసి ఇచ్చిన వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా 100 మంది నుంచి కోటి రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande