
అమరావతి, 25 జూన్ (హి.స.)
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సంచలన విషయాలు బయట పెట్టింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కస్టడీలో పెట్టిన హింసతోనే సాయికృష్ణ మృతి చెంది ఉండొచ్చని కోర్టుకు తెలిపింది. మృతదేహాన్ని మాయం చేసి ఆధారాలు చెరిపేసే ప్రయత్నం జరిగిందని ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేసింది. సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టుకు నిజాలు చెప్పకుండా తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించినట్లు ఆరోపించింది. పాత కేసుల్లో కోర్టు వాయిదాలకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్న సాయికృష్ణను మార్కాపురంలో అదుపులోకి తీసుకుని కృష్ణలంక స్టేషన్లో టార్చర్కు గురి చేసినట్లు ప్రాథమిక విచారణలో ఆధారాలు లభించినట్లు తెలిపింది. కృష్ణలంక మాజీ సీఐ ఎస్.ఎస్.వి.వి. నాగరాజు రిమాండ్ రిపోర్టులో ఆయన ప్రమేయాన్ని కోర్టుకు వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు మూడు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఐజీ రవిప్రకాశ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ను సందర్శించిన దర్యాప్తు అధికారి సుధాకర్ ప్రాథమిక విచారణ అనంతరం సీఐ నాగరాజుపై బీఎన్ఎస్ సెక్షన్ల కింద హత్య-103(1), అక్రమ నిర్బంధం-127(4), చట్టవిరుద్ధంగా నిర్బంధం కొనసాగింపు-127(6), ఆధారాలు మాయం-238 కేసు నమోదు చేశారు. కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ(25)పై మాచవరం, కృష్ణలంక పోలీస్ స్టేషన్లలో నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉండటంతో విజయవాడ టాస్క్ఫోర్స్ పోలీసులు మార్కాపురంలో ఉన్న అతడిని గుర్తించి మే 5 వేకువజామున 3 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడకు తీసుకొచ్చి మే 6న ఉదయం 7గంటల ప్రాంతంలో సెంట్రీ కానిస్టేబుల్కు అప్పగించారు. నిందితుడిని 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాల్సిన సీఐ నాగరాజు ఆ పని చేయలేదు.
ఈ విషయం తెలిసి సాయికృష్ణ తల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి సీఐని అడగ్గా.. తనను తీవ్ర పదజాలంతో దూషించినట్లు సిట్కు తెలిపింది. అదే సమయంలో తన కుమారుడి కేకలు వినిపించాయని, కాసేపటికి స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడని చెప్పింది. లాక్పలో తీవ్ర గాయాలతో ఉన్నట్లు తన కళ్లారా చూసినట్లు ఆమె ఇచ్చిన వాంగ్మూలాన్ని సిట్ కోర్టుకు సమర్పించింది. సాయికృష్ణ పిన్ని కనకదుర్గ(న్యాయవాది) మే 8 వరకూ పలుమార్లు స్టేషన్కు వెళ్లి అడగ్గా సీఐ పొంతనలేని సమాధానాలు చెప్పారు. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయగా, కోర్టుకు సైతం నిజాలు చెప్పకుండా తప్పుదోవ పట్టించారు. తమ విచారణలో పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఇతర ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం మేరకు సాయికృష్ణ మే 6 నుంచి 8 వరకూ కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఉన్నట్లు సిట్ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో సిట్ 17 మంది సాక్షులను విచారించింది.
కేసులో అత్యంత కీలకంగా మారిన సీసీ ఫుటేజీ నిమే 1 నుంచి జూన్ 1 వరకూ లేకుండా తొలగించారు. ఈ విషయాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ ధ్రువీకరించింది. కృష్ణలంక స్టేషన్ డీవీఆర్లో వీడియో డేటా లభించలేదని స్పష్టం చేసినట్లు సిట్ తెలిపింది. ఈ చర్యతో పాటు సాక్షుల వాంగ్మూలాలు, మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచకపోవడం, కుమారుడి ఒంటిపై గాయాలు చూశానన్న తల్లి స్టేట్మెంట్, సాయికృష్ణ ఆచూకీ లభించకపోవడంతో అతను కస్టోడియల్ హింస వల్లే మృతిచెందినట్లు బలమైన అనుమానం వ్యక్తం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ