
హనుమకొండ, 25 జూన్ (హి.స.)
మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు సమష్టిగా కృషి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి అన్నారు.
అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో గురువారం హన్మకొండలో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వ్యసనం సమాజానికి పెను సవాలుగా మారుతోందని పేర్కొన్నారు. యువత తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తేనే మత్తు పదార్థాల నిర్మూలన సాధ్యమవుతుందని అన్నారు.ఆరోగ్యకరమైన జీవన విధానం, క్రీడలు, విద్య, సృజనాత్మక కార్యక్రమాల వైపు యువతను ప్రోత్సహించడం ద్వారా వ్యసనాలకు దూరంగా ఉంచవచ్చని కలెక్టర్ తెలిపారు. మత్తు రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం.విశ్వజ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, హనుమకొండ ఎసిపి నరసింహ రావు, డిప్యూటీ సివిల్ సర్జన్ ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, ఈగల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రవీందర్, బాల రక్షా భవన్ కో ఆర్డినేటర్ అవంతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కజాంపురం దామోదర్, జిల్లా బాలల పరిరక్షణ ఇంచార్జి అధికారి ఎస్ ప్రవీణ్ కుమార్, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ ఎస్ భాస్కర్, మహిళా శక్తి కేంద్రం జిల్లా కో ఆర్డినేటర్ కళ్యాణి, సఖి అడ్మిన్ హైమావతి, డెమో అశోక్ రెడ్డి, హెల్పింగ్ హ్యాండ్ స్వచ్ఛంద సంస్థ రాము, ఎఫ్.రవి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు