
జోగులాంబ గద్వాల్, 25 జూన్ (హి.స.)
పోలింగ్ స్టేషన్ల వారీగా నియమించబడిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎన్ఏలు) ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్గా బూత్ లెవల్ అధికారులకు (బీఎల్వేలు) సహకారం అందించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం చేపట్టిన ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను గురువారం గద్వాలలోని 26వ వార్డు, గంట వీధిలో గల పోలింగ్ బూత్ నంబర్- 264 పరిధిలో కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎల్వోలు తమ పరిధిలోని ప్రతి ఇంటికి ఎన్నుమరేషన్ ఫారాలను అందజేసి, అందులో పొందుపరిచిన అన్ని వివరాలను ఓటర్లు పూర్తిగా పూరించి అందజేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. రోజువారీ సర్వే వివరాలను బీఎల్వోలు ఎప్పటికప్పుడు సంబంధిత యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే సందర్భంగా బీఎల్ వోలతో పాటు బూత్ లెవల్ ఏజెంట్లు కూడా తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులు ధరించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ పలువురు ఓటర్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులు ప్రస్తావించిన వివిధ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గద్వాల తహసీల్దార్ హరికృష్ణ, ఎన్నికల ఉప తహసీల్దార్ ఉదయ్ కిరణ్, ఆచ్ఐ వెంకటేశ్వర్ రెడ్డి, సూపర్వైజర్ నాగేంద్రమ్మ, బీఎల్వో శ్రీలత, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు