రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ను బొంద పెట్టిండు : కేటీఆర్
రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ను బొంద పెట్టిండు : కేటీఆర్
Ktr


రంగారెడ్డి, 25 జూన్ (హి.స.)

ఒక తప్పు మాత్రం చేసినం.. కార్యకర్తల గౌరవం కాపాడలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం వారు చేవెళ్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం, ఎస్ఐఆర్ శిక్షణా కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ... చాలా మంది అన్నరు నాతో.. అన్నా పెన్షన్లు, కార్డులు, కల్యాణ లక్ష్మి ఆన్లైన్ అయిపాయే.. రైతు బంధు ఇస్తే అకౌంట్లో పడే. ఇక నా సంగతి ఏంది.. నన్ను ఎవరు పట్టించుకుంటరు.. ఊళ్లే పోయి అడగాలంటే నా గౌరవం ఎక్కడుంటది అని అన్నారు.. అందుకే ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లు జరుగకుండా చూసుకుంటమని నేను మీకు మాటిస్తున్నానన్నారు.

వాస్తవానికి మొత్తం ప్రభుత్వం మీద దృష్టి పెట్టినం.. పార్టీ మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు. కొత్త రాష్ట్రం, కొత్త సంసారం కాబట్టి పునాది గట్టిగా పడాలి అని.. మన రాష్ట్రం నవ్వే వాళ్ళ ముందు జారిపడొద్దని.. మీకు పరిపాలన చేతనైతదా అన్నోళ్లను నోళ్లు మూయించాలే.. మంచిగా నడిపించాలని ఆలోచన చేసాం తప్ప వేరే ఆలోచన చేయలేదు. కానీ నేను మీకు మాటిస్తున్నా.. వచ్చే ఐదేళ్లు అట్లుండది.. 2028లో మీ అందరి దయతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయితరు.. అయిన తర్వాత నేను బాధ్యత తీసుకుంటా.. వచ్చే ఐదేళ్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తల బాగోగులు, ప్రజల సంక్షేమం రెండింటిని బ్యాలెన్స్గా నడిపించే బాధ్యత నాదని భరోసానిచ్చారు.

మీకు రావాల్సిన పదవులు.. జరుగాల్సిన లాభం. మీకు కోరుకునే గౌరవం వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. గతం మరిచిపోండి.. చిన్నచిన్నపొరపాట్లు జరిగి ఉండొచ్చు. ఇక్కడ ఉద్యమంలో పనిచేసిన బిడ్డలు కూడా ఉన్నారు. వాళ్లకు కూడా అయ్యో మాకు జరుగాల్సిన న్యాయం జరుగలేదనే భావన ఉండొచ్చు.

నేను వారందని ప్రార్థిస్తున్నా.

ఒక సైనికుడు శాంతి సమయంలో ఎంత చెమట చిందిస్తే, యుద్ధంలో అంత తక్కువ రక్తం కారుతుంది. మీ ఈ టైంలో పార్టీని బందబస్తుగా నిర్మాణం చేసుకుంటే రేపు ఎన్నికలు వచ్చినంక ఆగమాగమయ్యే బాధ తప్పుతది.. మీకు ఐడీ కార్డు వస్తది.. ఆ ఐడీ కార్డు రేపు మన ప్రభుత్వం వచ్చినంక జేబులో పెట్టుకొని పోతే ఆ ఆఫీసర్ అయినా పోలీసోడు అయినా కేసీఆర్ మనిషి వచ్చిండు పని చేయాలని మీకు గౌరవమిచ్చి పనిచేసే పరిస్థితి ఉంటది. మంచి ఐడీ కార్డు తయారుచేసి ప్రతీ కార్యకర్తకు ఇస్తం. మిమ్మల్ని రాబోయే 5 సంవత్సరాలు మాత్రం గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరుగకుండా ఉద్యమకారులను కానీ, కార్యకర్తలను కానీ కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత తీసుకుంటానన్నారు. ప్రభుత్వం లేదు.. పవర్ లేదు కానీ గర్వంగా ఎక్కడనిపిస్తుందంటే ఎమ్మెల్యే పోయినా.. ఎంపీ పోయినా.. అధికారం పోయినా ఇంతమంది సోదరులు ఇక్కడికొచ్చి మీరు చేస్తున్న ప్రకటన మామూలు ప్రకటన కాదు.. ఇది కాంగ్రెస్, బీజేపీ పార్టీ గుండెల్లో రైళ్లను ఉరికించే గొప్ప దృశ్యం ఇక్కడ కనిపిస్తుందని చేవెళ్ల సమావేశాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

మన ప్రభుత్వం, పెద్దలు కేసీఆర్ ఉన్నప్పుడు షాబాద్లో చందన్ వెల్లిలోకానీ, సీతారాంపూర్లో కానీ ఎకరం 30 లక్షలుండేది. కానీ అక్కడ ఇండస్ట్రియల్ పారిశ్రామిక పార్క్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీలు ఒక మెక్రోసాఫ్ట్, అమెజాన్ వెల్స్ఫన్ ఇతర కంపెనీలు తీసుకొచ్చిన తర్వాత నేడు ఎకరం 3 కోట్లకు తక్కువ షాబాద్లో లేని పరిస్థితి ఉంది. అదే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత లక్షల మంది రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి పనిచేసుకునే తమ్ముళ్లు, చెల్లెళ్లందరూ ఇవాళ దివాళా తీసే పరిస్థితి వచ్చిందన్నారు.

వాస్తవేంటంటే ఎన్నికలకు ముందు ఎకరం కోటి రూపాయలు పలికింది కూడా ఇవాళ కనీసం రూ.50 లక్షలు, రూ.60 లక్షలకు కూడా కొనేందుకు ఎవరూ సిద్దంగా లేరన్నారు. దారుణమైన పరిస్థితి ఉంది. ఎందుకీ పరిస్థితి ఉందనేది మనం ఆలోచన చేసుకోవాల్సి ఉందని కేటీఆర్ గుర్తు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande