తెలంగాణ రాజకీయాలలో అరుదైన దృశ్యం.. అప్యాయంగా పలకరించుకున్న కేటీఆర్, ఈటల
తెలంగాణ రాజకీయాలలో అరుదైన దృశ్యం.. అప్యాయంగా పలకరించుకున్న కేటీఆర్, ఈటల
KTR


హైదరాబాద్, 25 జూన్ (హి.స.)

తెలంగాణ రాజకీయాల్లో నేడు ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఒకే పార్టీలో ఉండి ఇప్పుడు ప్రత్యర్థులుగా మారిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గురువారం ఉదయం పరస్పరం ఎదురుపడ్డారు. జన్వాడలోని ఓ ప్రైవేట్ వేడుకల మందిరంలో కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కొడుకు పెళ్లిలో ఈ ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఒకే సమయంలో ఇద్దరు నేతలు ఎదురుపడటంతో పాత వైరాన్ని మరిచిపోయి పరస్పరం ఆప్యాయంగా పలకరించుకుని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ అక్కడే ఉన్న తన కుమారుడు హిమాన్షును పిలిచి ఈటలతో మాట్లాడించారు.

కేటీఆర్-ఈటల రాజేందర్ అపూర్వ కలయిక రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. బీఆర్ఎస్, బీజేపీ పొత్తు కుదరబోతోందని ఇరు పార్టీల నేతల మధ్య సత్సంబంధాలు ఉన్నాయనడానికి కేటీఆర్, ఈటల కలయికే నిదర్శనం అని కాంగ్రెస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ కామెంట్స్ కు బీఆర్ఎస్ మద్దతుదారులు కౌంటర్ ఇస్తున్నారు. ఈ పెళ్లికి బీజేపీ కాంగ్రెస్ మంత్రి పొన్నం కూడా హాజరయ్యారని, నిజానికి కాంగ్రెస్, బీజేపీ మధ్యనే సత్సంబంధాలు ఉన్నాయంటూ మోడీ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒకే వేదికపై ఉన్న ఫోటోలను బీఆర్ఎస్ మద్దతుదారులు షేర్ చేస్తున్నారు. మొత్తంగా గతంలో ఒకే పార్టీలో కలిసి పని చేసిన కేటీఆర్, ఈటల ఇప్పుడు ప్రత్యర్థులుగా మారినప్పటికీ ఇలా పరస్పరం మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆహ్వానించదగిన విషయం అని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande