విద్యార్థులకు షాక్.. ప్రైవేట్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట
విద్యార్థులకు షాక్.. ప్రైవేట్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట
High court


హైదరాబాద్, 25 జూన్ (హి.స.)

తెలంగాణలోని ప్రైవేటు కాలేజీల

యాజమాన్యాలకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో గురువారం పెద్ద ఊరట లభించింది. ఫీజుల వసూలు, ఫీజు రియింబర్స్మెంట్కు సంబంధించి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 9 (GO Ms No. 9)లోని మార్గదర్శకాలపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఈ స్టే ఆదేశాలు వచ్చే మంగళవారం వరకు వర్తిస్తాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వం రియింబర్స్మెంట్ నిధులు విడుదల చేసే వరకు కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదంటూ జీవో నెం. 9లో పెట్టిన నిబంధనలను హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ప్రభుత్వం తరఫున నిధులు విడుదల కాకుండా, కాలేజీలు తమ రోజువారీ నిర్వహణను ఎలా కొనసాగిస్తాయని ప్రశ్నించింది. సర్కారు బకాయిలు చెల్లించకుండా.. కాలేజీలు ఫీజులు వసూలు చేయవద్దని ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసమని కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ సందర్భంగా ఫీజు రియింబర్స్మెంట్ పథకానికి సంబంధించి ప్రభుత్వంపై హైకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. ఈ పథకం కోసం అసలు బడ్జెట్లో ఎంత మొత్తాన్ని కేటాయించారు? ఆ నిధుల విడుదల ప్రక్రియ ఎలా ఉందనే అంశాలపై వివరాలు తెలపాలని కోరింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన కోట్ల రూపాయల బకాయిలు నిలిచిపోవడం వల్ల కాలేజీల మనుగడ సాగడం కష్టంగా మారిందని, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందికి జీతాలు చెల్లించడం కూడా యాజమాన్యాలకు భారం అవుతోందని అభిప్రాయపడింది. ప్రభుత్వ నిబంధనలపై స్టే విధిస్తూ తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ లోగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఆ వేశించింది. హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఆరష్టు 15వ తేదీలోపు బకాయిలు క్లియర్ చేస్తామని ఈ సందర్భంగా కోర్టుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande